కొరటాల డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌30వ సినిమా ఫిక్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బీజీగా ఉన్న తారక్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రశాంత్‌నీల్‌తో మరొకటి లైన్‌లో ఉంది. దీంతో ఎన్టీఆర్‌ తన తర్వాతి చిత్రం ఎవరితో చేస్తున్నారనే దానిపై ఇంతకాలం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎట్టకేలకు ఈ ఎదురుచూపులకు తెరపడింది. #NTR30 చిత్రం ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్నట్లు ఖరారైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’ మంచి విజయం సాధించింది. ఈ హిట్‌ కలయికలో రాబోతున్న మరో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జూన్‌ రెండో వారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 29, 2022 #NTR30ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘ఆర్ఆర్‌ఆర్‌’, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రాలు చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates