ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం

లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 245 మంది, వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటు వేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపించనందుకు నిరసనగా కాంగ్రెస్‌, అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ బిల్లుకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రతిపాదించిన పలు సవరణలు వీగిపోయాయి. ఈ బిల్లుపై సుమారు నాలుగు గంటలపాటు వాడీవేడి చర్చ జరిగింది. విపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను విన్న తర్వాత ప్రభుత్వ సమాధానం ఇచ్చింది. అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును కేంద్రం ఈ నెల 17న సభ ముందు పెట్టింది. వెంట వెంటనే మూడు సార్లు తలాక్‌ అంటూ ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. మూడు సార్లు తలాక్‌ చెప్పే భర్తలకు ప్రస్తుత చట్టం ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. రెండుసార్లు వాయిదా అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు తిరిగి లోక్‌సభ ప్రారంభం కాగానే కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. గతంలో ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభలో వీగిపోవడంతో రద్దైంది. గతంలో ప్రతిపక్షాలు వ్యక్తంచేసిన పలు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఆ మేరకు మార్పులు చేసి కొత్త చట్టం తీసుకొచ్చినట్టు కేంద్రమంత్రి తెలిపారు. ఈ బిల్లు మైనార్టీ మహిళల హక్కులు, వారిని న్యాయం చేసేందుకు సంబంధించిందని తెలిపారు. ముమ్మారు తలాక్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణించకూడదని పేర్కొనడం సమంజసం కాదన్నారు. ఈ సభ మహిళల గౌరవం కోసం ఉరిశిక్ష వేసే చట్టాలను చేసినప్పుడు అదే సభ ముమ్మారు తలాక్‌పై ఏకాభిప్రాయానికి ఎందుకు రాకూడదని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు.