ఆదికి పాట్నర్‌ కానున్న హన్సిక

ఆర్‌ఎఫ్‌సీ క్రియేషన్స్‌ బ్యానరుపై ఎస్పీ కోహ్లి నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పాట్నర్‌’. ‘ఈరం’, ‘అరవాన్‌’, ‘యూటర్న్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆది ఇందులో హీరోగా నటిస్తున్నారు. హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇది మొదటి సినిమా. ఆదికి జోడీగా ‘కుప్పత్తురాజా’ ఫేమ్‌ పాలక్కల్వాణి హీరోయిన్‌గా నటిస్తోంది. పాండియరాజన్, యోగిబాబు, రోబోశంకర్, వీటీవీ గణేశ్, జాన్‌విజయ్, రవిమరియా, తంగదురై తదితరులు నటిస్తున్నారు. ‘డోరా’కు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన మనోజ్‌ దామోధరన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘హాస్య ప్రధానంగా రూపొందించిన సినిమా ఇది. స్క్రీన్‌ప్లేను సినీజనాలు అభినందిస్తారని నమ్మకం ఉంది. హన్సిక పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఆది కెరీర్‌లోనే ఇది చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా పక్కా ఎనర్జిటిక్, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని’ పేర్కొన్నారు. సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. తొలి షెడ్యూల్‌ను ఇక్కడే చిత్రీకరించనున్నట్లు సమాచారం. సబీర్‌ అహ్మద్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ దయానిధి సంగీతం సమకూర్చుతున్నారు.