ధవళేశ్వరంలో జనసేన కవాతు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సర్ ఆర్థర్ కాటన్‌ వంతెనపై ఏర్పాటు చేసిన భారీ కవాతు ఉత్సాహంగా కొనసాగింది. పవన్‌ కల్యాణ్ నేతృత్వంలో ధవళేశ్వరం బ్యారేజీపై భారీ సంఖ్యలో కార్యకర్తలు నినాదాలతో ముందుకు సాగారు. ఈ కవాతు సందర్భంగా రూపొందించిన పదా.. పద.. పద సాంగ్‌ జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకు సుమారు 2.5కి.మీల మేర ఈ కవాతు జరిగింది.

ఈ కవాతు సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీకి ఇరువైపులా జనసేన జెండాలతో భారీగా ముస్తాబు చేశారు. గోదావరి నదిలో పడవలపై జనసేన పతాకాలతో కార్యకర్తలు సందడి చేశారు. అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఓపెన్‌టాప్‌ వాహనంలో పవన్‌ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెంచారు. అనంతరం వంతెన దిగువన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు.