తునిలో జర్నలిస్టు హత్య.. ఖండించిన పవన్


తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న తొండంగి అర్బన్ రిపోర్టర్ సత్యనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. అన్నవరం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఈ దారుణం జరిగింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన్ను హత్య చేశారు. సత్యనారాయణ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సత్యనారాయణ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు.

జర్నలిస్ట్ మర్డర్‌‌ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవిక చర్య అని, ప్రజాస్వామాన్యానికి మూలస్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఈ ఘటన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో ఓసారి సత్యనారాయణపై హత్యాయత్నం కూడా జరిగిందని.. అది పోలీసుల వరకు వెళ్లినా ఆయనకు రక్షణ కల్పించలేకపోయారని పవన్ పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించి జర్నలిస్టు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.