యాంకర్‌గా దర్శనమిచ్చిన రేణూదేశాయ్‌.. షాక్‌లో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే.. ఆయన మాజీ భార్య రేణూదేశాయ్ కూడా అదే జిల్లాలో పర్యటిస్తుండటం రాజకీయంగా కలకలం రేపుతోంది. రాయలసీమ పర్యటనలో భాగంగా కర్నూలులో దిగిన పవన్ కల్యాణ్.. తొలిరోజు బహిరంగసభలో అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండోరోజు ఆయన కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనీలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోనే పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ప్రత్యక్షమవడం రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేసింది. అది కూడా సాక్షి టీవీ యాంకర్ అవతారమెత్తడం.. జనసైనికులను షాక్‌కు గురిచేస్తోంది.

మంత్రాలయం పరిధిలోని పలు గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులను పరామర్శించేందుకు జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. అయితే, పవన్‌కు చెక్ పెట్టేందుకే రేణుదేశాయ్‌ను వైసీపీ రంగంలోకి దింపిందనే గుసగుసలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక, రేణుదేశాయ్ సాక్షి యాంకర్‌లా దర్శనమివ్వడం చూస్తుంటే.. ఇదంతా వైసీపీ స్కెచ్ అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షి లోగోను చేతిలో పట్టుకుని ఆమె రైతు కుటుంబాలతో మాట్లాడడం, వారి కష్టాలను తెలుసుకోవడం వంటివి చూస్తుంటే.. ఇదంతా పథకం ప్రకారమే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీకి గట్టి పట్టున్న సీమలో పవన్ ప్రభావం చూపకుండా ఈ స్కెచ్ వేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పవన్‌కు పోటీగా రేణూదేశాయ్‌ను పోటీకి దింపే విషయంలో వైసీపీ కూడా సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.