జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ హామీల జల్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన ఆ పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటున్నారో ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైతులపై వరాల జల్లు కురిపించారు. ఎకరాకు రూ.8వేల పంటల పెట్టుబడి సాయంతో పాటు 60 ఏళ్లు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు రూ.5వేల పింఛను అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటు రైతులకు ఉచితంగా సోలార్‌ మోటార్లు అందజేస్తామని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. యువత, మహిళలకు భరోసా కల్పిస్తూ హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టిన తొలి ఆరునెలల్లో లక్ష ఉద్యోగాలు.. ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాల కల్పనే తమ పార్టీ లక్ష్యమని ప్రకటించారు.

ముఖ్యమైన హామీలివే..

-ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు
– ఎవరూ లంచం అడగని వ్యవస్థ రూపకల్పన

– డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం
– ప్రభుత్వోద్యోగుల కోసం సీపీఎస్‌ రద్దు
– బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు

– నదులు అనుసంధానం చేసి కొత్త జలాశయాలు నిర్మాణం
– మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంకు. వేటకు వెళ్లని సమయంలో వారికి రోజుకు రూ.500ఆర్థిక సహాయం. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా
– అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు

– ముస్లింల అభ్యున్నతి కోసం సచార్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు
– స్త్రీలకు అండగా ఉండే, భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన. ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు, ఆస్పత్రి నిర్మాణం
– మహిళలకు శాసనసభలో 33శాతం రిజర్వేషన్లు
– డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
– ఆడపడుచులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు
– అన్ని మతాల మహిళలకు ఆయా పండుగలకు చీరల పంపిణీ
– ప్రతి మండలానికి కల్యాణ మండపం నిర్మాణం
– మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు
– మహిళలకు పావలా వడ్డీకే రుణాలు