జగన్‌ ఇప్పటికైనా నిజాలు గ్రహించారు: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రాష్ట్రంలో ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించారని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఇసుక అందుబాటులోకి రావటంతోపాటు, పంపిణీ కేంద్రాల సమాచారంపై ఓ అంగ్ల దినపత్రికలో వచ్చిన ప్రభుత్వ ప్రకటనను పవన్ ట్విటర్‌లో ఉంచారు.

ముఖ్యమంత్రికి నిజాలు తెలియజేయటంలో సహకరించిన మీడియా, రాజకీయపక్షాలు, సంస్థలు, వ్యక్తులకు పవన్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో 35 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని.. 50మంది మరణించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇసుక అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అవినీతికి ఆస్కారం ఉందన్నారు. ఇసుక పంపిణీపై నిఘా ఉంచాలని జనసేన కార్యకర్తలకు పవన్‌ పిలుపునిచ్చారు.