అందుకే గాజువాక నుంచి పోటీ: పవన్‌ కల్యాణ్‌


జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని అగనంపూడి శివాలయం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్‌ మాట్లాడారు. 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. గాజువాక నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. జనసేన గెలిచిన తర్వాత అగనంపూడిని రెవెన్యూ డివిజన్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో సమస్యలు ఉన్న గాజువాకను గత పాలకులంతా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అందుకే తాను గాజువాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పవన్‌ స్పష్టంచేశారు.

గంగవరం పోర్టు కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గాజువాకలో నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రాతంలో అనేక సమస్యలు ఉన్నాయని, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేస్తానని పవన్‌ హామీ ఇచ్చారు.