దాసరి బయోపిక్‌ రాబోతుంది!

దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. పుట్టినవారు మరణించక తప్పదు. మరణించిన వారు మళ్లీ జన్మించక మానరు…అన్నట్లుగా దాసరి గారు మళ్ళీ మన మధ్యకి రావాలని కోరుకుంటున్నాను…అన్నారు నటుడు, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు ఓ కళ్యాణ్‌. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జీవిత కథాంశంతో అతి త్వరలో ఓ చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’సినీ కళామతల్లికి దాసరి గారు ముద్దు బిడ్డ. సినీ రంగానికి ఆయన ఒక దిక్సూచి. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన అనంతలోకానికి పయనమైనా..ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉండాలని..దాసరిగారి బయోపిక్‌ చిత్రాన్ని నిర్మించనున్నాను. గురువు గారి జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ చిత్రంలో చూపించనున్నాము. దాసరి గారి ప్రియ శిష్యుడైన ఓ దర్శకుడు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టైటిల్‌, ఆర్టిస్ట్‌ల వివరాలు అతి త్వరలో తెలియజేస్తాను…అన్నారు.