HomeTelugu Big Storiesతెలుగు ప్రజల సుస్థిరత కోసమే అలా చేశా: పవన్

తెలుగు ప్రజల సుస్థిరత కోసమే అలా చేశా: పవన్

13 1

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ జిల్లా స్థాయి సమీక్షలను ప్రారంభించారు. ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేయడమే తమ పార్టీ విధానమని అన్నారు. కొత్త తరాన్ని చట్ట సభల్లో ప్రవేశపెట్టబోతున్నామన్నారు. మేలైన అనుభవజ్ఞులు, యువత, మహిళల మేళవింపుతో వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతామని అన్నారు. తమ ప్రచారం కేవలం ఎన్నికల కోసమే కాదని తేల్చి చెప్పారు.

పొత్తుల పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేనతో పొత్తు కట్టేశామని, వారికి కొన్ని స్థానాలు ఇచ్చామని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఈ సందర్భంగా పవన్‌ కోరారు. తమ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసేందుకు, వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. తాను 2014లో కొన్ని పార్టీలకు మద్దతిచ్చానని, తెలుగు ప్రజల సుస్థిరత కోసమే ఆరోజు అలా చేయాల్సి వచ్చిందని పవన్ వివరించారు. ఇప్పుడు జనసేన సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీకి వెళ్తామని అన్నారు. అధికార, ప్రతిపక్షాలతో కలవకుండా కేవలం వామపక్షాలను మాత్రం కలుపుకునే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

25 ఏళ్లపాటు యువత భవిష్యత్తుకు అండగా ఉండాలని, కొత్తతరం నాయకత్వంవైపు చూంస్తున్నట్టు పవన్ తెలిపారు. మేలైన, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పాటు 175 స్థానాల్లో ఎక్కువ శాతం కొత్తవారికి, యువతకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని పవన్ కల్యాణ్ వివరించారు. జిల్లా స్థాయి సమీక్షలకు పవన్ శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా నాయకులు, సమన్వయ కర్తలతో సమావేశమయ్యారు. జనసేన వెంట వున్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని, నేతలకు దిశా నిర్దేశం చేశారు. కులాల మధ్య సయోధ్య పెంచి, వెనకబడిన కులాలను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. నేతలు వ్యక్తిగతంగా కాకుండా, పార్టీ అజెండాతో ముందుకెళ్లాలని తెలిపారు. జనవరి నెలాఖరున ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పవన్‌ వెల్లడించారు. పార్టీ వర్కింగ్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేస్తున్నామని, పార్టీ జిల్లా కమిటీలు సమర్థంగా దాన్ని అమలు చేయాలన్నారు. పార్టీ నాయకులుగా సంస్కారవంతమైన భాష ఉపయోగించాలని స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu