HomeTelugu Newsరెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్‌ పోటీ

రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్‌ పోటీ

1 18జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 స్థానాలు (అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం) పరిశీలించిన అనంతరం అంతర్గత సర్వే నిర్వహించి ఈ రెండు స్థానాలు ఎంపిక చేసినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నెల 21న గాజువాకలో, 22న భీమవరంలో పవన్‌ కల్యాణ్ నామినేషన్ వేయనున్నారు. 21న ఉదయం 10.30 నుంచి ఒంటి గంట మధ్య గాజువాకలో.. 22న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య భీమవరంలో ఆయన స్వయంగా నామినేషన్‌ పత్రాలు అందజేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధిలోని గాజువాక శాసనసభ స్థానాల నుంచి పవన్‌ బరిలోకి దిగుతున్నట్టు ఇవాళ జనసేన ప్రకటించింది. తన పోటీపై జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని పవన్‌ చెప్పారు.

పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి పోటీ చేస్తారని తొలి నుంచీ ప్రచారం జరిగింది. మరో స్థానం ఎక్కడి నుంచా అనేది కొంత సస్పెన్స్‌లో ఉంచారు. ముందుగా తిరుపతిలో పోటీ ఉండొచ్చని ప్రచారం జరిగింది. ఫైనల్‌గా భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పవన్‌ ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. అయితే, ముందుగా అనుకున్నట్లు ఉత్తరాంధ్ర నుంచి ఒక స్థానంలో (గాజువాక) పోటీ చేస్తుండగా.. రెండో స్థానం ఆయన సొంత జిల్లా నుంచే కావడం గమనార్హం. సొంత జిల్లాతో పాటు సామాజికవర్గం పరంగా భీమవరం స్థానం పవన్‌కు కలిసొచ్చే అంశం.

ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ తన సోదరుడు చిరంజీవి బాటను అనుసరిస్తున్నారనే చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu