అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్ కల్యాణ్‌‌!

ఎన్నికల వేళ అభిమానులు, కార్యకర్తల తీరు పార్టీ అధినేతలు, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రోడ్‌షోలో వైసీపీ నేత వైఎస్ షర్మిల ఉంగరాన్ని లాక్కెళ్లేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించగా.. తాజాగా విజయనగరంలో జనసేన బహిరంగ సభలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. వేదికపై పవన్‌ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని పవన్‌ కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో ఆయన ఒక్కసారిగా తుళ్లిపడి వేదికపై కింద పడిపోయారు. మైక్‌ కూడా విరిగిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆయన్ని పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విజయనగరంలో అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదికపైకి పవన్‌ చేరుకున్న కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.