ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి: పవన్‌ కల్యాణ్‌


ఆంధ్రా ప్రజలు వేరు.. పాలకులు వేరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. తన చేతిలో తెలంగాణ ఉద్యమం ఉండుంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనపై అడ్డగోలుగా మాట్లాడటం తనకు ఇష్టముండదన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్‌ మాట్లాడారు. ప్రతిపక్షం ఉండకూడదంటే ఎలా అని మోడీ, చంద్రబాబు, కేసీఆర్‌ను ప్రశ్నించారు. దేశభక్తి అంటే సినిమా థియేటర్‌లో నిరూపించుకోవాలా? అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మార్పు రావాలని తాను కోరుకుంటున్నానన్నారు. టీఆర్‌ఎస్‌లోకి అన్ని పార్టీల నేతలు వచ్చేశారన్నారు. తన ముందే కేసీఆర్‌ను తిట్టిన నేతలంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారంటూ తలసాని, ఎర్రబెల్లి పేర్లను పవన్‌ ఉదహరించారు.

సరికొత్త తెలంగాణ కోసం యువరక్తం రాజకీయాల్లోకి రావాలని.. ఆవేశంతో కాకుండా ఆలోచనతో కూడిన తెలంగాణ కావాలన్నారు. ఉద్యమం కోసం పనిచేసిన ఆడపడుచులు కూడా ఉన్నారని వారికి కూడా అవకాశం దక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ప్రజలను రెచ్చగొట్టడానికి, కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టడానికి ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. దేశ ప్రధానిగా బీఎస్పీ అధినేత్రి మాయావతిని చూడాలని ఉందంటూ తన ఆకాంక్షను పవన్‌ వెలిబుచ్చారు. ఛాయ్‌వాలా ప్రధానమంత్రి అయినపుడు మాయావతిని ప్రధానిగా ఎందుకు చూడకూడదని ప్రశ్నించారు. ఆమె ఎంతో బలమైన నాయకురాలని.. ఆమెలో అనురాగంతో కూడిన మాతృమూర్తిని చూశానన్నారు.