ట్రంప్‌ మార్ఫింగ్‌ వీడియో.. నెటిజన్ల ప్రశంసలు .. వైరల్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మార్ఫింగ్‌ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన చిత్రం ‘బాజీరావ్‌ మస్తానీ’. సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన పేశ్వా యోధుడు బాజీరావ్‌ పాత్రను పోషించారు. ఇందులోని ‘మల్హారి..’ పాటలో రణ్‌వీర్‌ తన సైన్యంతో కలిసి చిందులేస్తారు. అయితే ఇప్పుడు ఆ వీడియోలో కొందరు రణ్‌వీర్‌ ముఖానికి బదులు ట్రంప్‌ ముఖాన్ని మార్ఫింగ్‌ చేశారు. దీంతో ట్రంప్‌ చిందులేస్తున్నట్లు కనిపిస్తోంది.

47 సెకన్లు ఉన్న ఈ సరదా వీడియో నవ్వులు పూయిస్తోంది. సోషల్‌మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ‘ఈ వీడియో క్రియేట్‌ చేసిన వారిని సత్కరించాలి. చాలా సరదాగా ఉంది, పేశ్వా యోధుడు ట్రంప్‌, ఈ వీడియోను ఇప్పటికీ వందసార్లు చూశా, కళ అంటే ఇదేనేమో, చాలా నచ్చింది, అద్భుతం, సూపర్‌..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల మంది వీడియోను చూశారు. 12 వేల మంది లైక్‌ చేయగా, 2 వేల మంది రీట్వీట్ చేశారు.