ఆర్టీజీఎస్‌తో నష్టాన్ని తగ్గించగలిగాం: చంద్రబాబు

గండం గడిచింది. తుపాను తీరం దాటింది. తీవ్ర బీభత్సం సృష్టిస్తుందని అందరూ భయపడినా దిశ మార్చుకుని పెథాయ్‌ తుపాను ఒడిశా వైపు వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెథాయ్‌ తుపాను తీరాన్ని తాకిన సమయంలో భీకర గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు వెయ్యి హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్‌ను 4 రోజులుగా భయపెట్టిన పెథాయ్‌ తుపాను సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 3.30 గంటలకు కాకినాడ-యానాం మధ్య తీరాన్నిదాటింది. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన పెథాయ్‌ తుపాను క్రమంగా బలహీనపడుతూ ఒడిశా వైపు వెళుతోంది.

భారత వాతావరణ శాఖ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించి ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, కోస్ట్‌గార్డ్‌ సిబ్బందిని రంగంలోకి దించింది. తుపానుపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 7 జిల్లాల్లో ఏపీడీఆర్ఎఫ్‌ సేవా బృందాలు మోహరించాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, మలికిపురం,
అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.

భారీ గాలులకు చెట్లు కూలడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు, విమానాల రాకపోకపై పెథాయ్ తుపాను ప్రభావం పడింది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుపానులు తీరానికి చేరువయ్యే సమయంలో విధ్వంసం సృష్టిస్తాయి. పంటలు, మౌలిక సదుపాయాలపై బాగా దెబ్బపడింది. ఉత్తర ఆస్ట్రేలియాకు సమీపంలోని హిందూ మహా సముద్ర తీరంలో ఏర్పడ్డ వాయుగుండం అల్పపీడనంగా మారడమే దీనికి కారణమని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి తుపాను ముప్పు తప్పినా రెండు రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల పాటు కుండపోత వర్షం కురుస్తుందని చెబుతున్నారు.
భీకర గాలులతో చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. మరోవైపు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏపీలో ఇప్పటి వరకు 9 మంది మృతిచెందారు.