నరేంద్ర మోడిపై శత్రుఘ్నసిన్హా వ్యంగ్యాస్త్రాలు

భారత ప్రధాని నరేంద్ర మోడిపై బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా వ్యంగ్యాస్త్రాలు వదిలారు. తమ పార్టీ అధిష్ఠానంపై చాలా కాలంగా ఆయన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మోడి ఇంటర్వ్యూపై ఆయన స్పందిస్తూ… “స్క్రిప్టు, దర్శకత్వం అద్భుతం. చాలా బాగా పరిశోధన చేసి సాధన చేసి సోమవారం సాయంత్రం ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రధాని చాలా ప్రశాంతంగా కూర్చుని సమాధానాలు చెబుతున్నట్లు కనపడింది. కానీ, గతంతో పోల్చితే అంతటి సమర్థవంతంగా ఇప్పుడు ప్రదర్శన ఇవ్వలేకపోయారు. మీడియా నుంచి వచ్చే ప్రశ్నలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా లేరని మాకు తెలుసు. కనీసం కేంద్ర మాజీ మంత్రులు, బీజేపీ మాజీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్‌ శౌరీలు అడుగుతున్న ప్రశ్నలకైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా?” అని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

“మాజీ ప్రధానులంతా మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు కానీ, మోడి.. నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క మీడియా సమావేశంలో కూడా పాల్గొనలేదుఎందుకో చెప్పాలన్నారు. మీ రాజ దర్బారు నుంచి తెచ్చుకున్న వారితో కాకుండా నిజమైన జర్నలిస్టులతో మాట్లాడాలని అన్నారు. ఎన్డీయే నుంచి పలు పార్టీలు బయటకు వెళ్లిపోతున్నాయని ఇకనైనా మోడి తన తీరు మార్చుకోవాలని శత్రుఘ్న సిన్హా సూచించారు. “సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్‌ (అందరితో పాటు అందరి అభివృద్ధి కోసం) అనే
నినాదాన్ని ఇస్తున్నప్పటికీ కొందరు ఎన్డీయేను ఎందుకు వదిలి వెళుతున్నారు? ఈ కొత్త ఏడాదిలోనైనా స్వచ్ఛంగా ఉండండి. ధైర్యంగా, నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించండి” అని పేర్కొన్నారు.