ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు భార్య

టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల రూమర్స్ షికార్లు చేశాయి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఈయ‌న పెళ్లి టాపిక్ డైలీ సీరియ‌ల్‌ కంటే దారుణంగా సాగుతోంది. ఏళ్ల‌కేళ్లు సాగదీస్తూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చ‌డం లేదు. అదిగో.. ఇదిగో అంటున్నారే తప్ప ప్ర‌భాస్ పెళ్లి ముచ్చ‌ట‌ ఓ ప‌ట్టాన తేల్చడం లేదు.. అలాగ‌ని ప్ర‌భాస్‌ను వ‌ద‌ల‌రు. ఎప్పుడు ఎక్క‌డ దొరికినా కూడా ప్ర‌భాస్ పెళ్లి ముచ్చ‌ట ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

తన పెళ్లి విషయంపై ప్రభాస్‌ని అడిగితే ఆయ‌న మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకుంటూనే ఉంటాడు. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ పెళ్లి గురించి ఆయన పెద్దమ్మ.. కృష్ణంరాజు భార్య శ్యామ‌లా దేవి మాట్లాడారు. దాంతో మ‌రోసారి ఈయ‌న పెళ్లి విషయం హాట్ టాపిక్ అయిపోయింది. మూడేళ్ల కింద అంటే బాహుబ‌లి అన్నాడు.. ఆ త‌ర్వాత అడిగితే అది పూర్త‌య్యాక అన్నాడు.. బాహుబ‌లి అయిన త‌ర్వాత ఇప్పుడు సాహోతో పాటు రాధాకృష్ణ కుమార్ సినిమా చేస్తున్నాడు. దానికి తోడు అప్పుడే ప్ర‌భాస్ వ‌య‌సు కూడా 39కి వ‌చ్చేసింది. అయినా కూడా పెళ్లి వైపు చూడ‌టం లేదు ఈ హీరో.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ లిస్ట్‌లో ఈయ‌నే ముందున్నాడు కూడా. అయితే ఇప్పుడు ప్రభాస్ పెద్ద‌మ్మ, కృష్ణంరాజు భార్య శ్యామ‌లా దేవి ప్రభాస్ పెళ్లి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్ర‌భాస్ పెళ్లి గురించి తాము కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నామ‌ని.. అత‌డి పెళ్లిపై వ‌చ్చే వార్త‌ల‌ను తాము స‌ర‌దాగా తీసుకుంటామ‌ని చెబుతున్నారు. అది చూసి న‌వ్వుకోవ‌డం కూడా అల‌వాటు చేసుకున్నామ‌ని చెబుతున్నారు కృష్ణంరాజు స‌తీమ‌ణి. ఇక ఇప్పుడు ఈమె ప్ర‌భాస్ పెళ్లి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.. ప్ర‌స్తుతం న‌టిస్తున్న రెండు సినిమాలు పూర్తైన త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటారని.. ఈ విషయం ప్రభాస్ తనతో చెప్పిన‌ట్లు ఆవిడ తెలియజేశారు. త‌మది చాలా పెద్ద కుటుంబం అని.. అంద‌రిలో క‌లిసిపోయే అమ్మాయే కావాల‌ని చెప్పారు. అలాంటి అమ్మాయి కోస‌మే చూస్తున్నామ‌ని.. దొరికిన‌పుడు క‌చ్చితంగా ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని చెప్పారు శ్యామ‌లా దేవి. ఇప్ప‌టికే ప్ర‌భాస్ కోసం వాళ్ల బంధువర్గంలోనే ఓ అమ్మాయిని చూస్తున్నార‌ని తెలుస్తుంది. ఎప్పట్లా కాకుండా ఈ సారి మాత్రం కచ్చితంగా ప్రభాస్ తన పెళ్లి గురించి తీపికబురు చెప్తాడని ఆశిస్తున్నారు అభిమానులు.