రక్తం చిందించే ప్రతి ఒక్కరికీ నిలదీసే హక్కు ఉంది.. ‘ఎన్జీకే’ ట్రైలర్‌

ప్రముఖ హీరో సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎన్జీకే’. సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో సూర్య దేశం కోసం పోరాడే ఓ రాజకీయ నాయకుడిగా కనిపించారు.

‘ఓ చిన్న గుంపును వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారు అనుకున్నావా?’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. సూర్య రాజకీయ ప్రవేశంపై ఆయన తల్లి భయపడుతూ కనిపించారు. ‘ఇలా చదువుకున్న వాళ్లంతా మనకెందుకు అని పారిపోవడం వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది’ అని ఓ వ్యక్తి బాధపడుతున్నారు. ‘రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకీ, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కు ఉంది’ అంటూ సూర్య ఆవేశంతో ప్రసంగించడం ఆకట్టుకుంది.