‘సాహో’ ప్రత్యేక గీతం.. వైరల్‌

‘సాహో’ మూవీ నుండి ప్రత్యేక గీతం విడుదలైంది. ఇందులో ప్రభాస్‌తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చిందులేశారు. ‘డార్లింగ్’ చుట్టూ పదుల సంఖ్యలో అమ్మాయిలున్నారు. ‘మేబీ ఐయామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌ కెన్‌ యు బి మై బ్యాక్‌బోన్‌ హాయ్‌ బేబీ సో..’ అంటూ తెలుగు, ఇంగ్లిషు కలగలిపి ఈ పాట లిరిక్స్‌ రూపొందించారు. జాక్వెలిన్‌ డ్యాన్స్‌, అందం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆమె, ప్రభాస్‌కు మధ్య కెమిస్ట్రీ కుదిరిందని, ప్రత్యేకంగా ఉందని యూట్యూబ్‌లో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ‘డార్లింగ్‌’ పరిచయ గీతంగా సినిమాలో దీన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమాలోని ‘సైకో..‌’, ‘ఏ చోట నువ్వున్నా..’ అనే రెండు గీతాల్ని విడుదల చేశారు. ఇప్పుడు మూడో గీతంగా ‘బ్యాడ్‌ బాయ్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.