ప్రియాంక-నిక్‌ల వివాహం అయిపోయింది

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ పెళ్లయిపోయిందని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ప్రకటించింది. జోధ్ పూర్ లో ప్రియాంక, నిక్ క్రైస్తవ పద్ధతిలో వివాహ ప్రమాణాలు చేసినట్టు ఐయాన్స్ తెలిపింది. వధూవరులిద్దరూ రాల్ఫ్ లారెన్ డిజైన్ చేసిన దుస్తులు ధరించారని పేర్కొంది. 36 ఏళ్ల ప్రియాంక చోప్రా రాల్ఫ్ లారెన్ ప్రత్యేకంగా తయారుచేసిన వెడ్డింగ్ గౌన్ లో మెరిసిపోయింది. జొనాస్, చోప్రా కుటుంబాలు, తోడి పెళ్లికొడుకు, తోడి పెళ్లికూతురు సహా వివాహానికి హాజరైన వారంతా రాల్ఫ్ లారెన్ డిజైనర్ దుస్తులు ధరించడం విశేషమని తెలిపింది. ఈ ఉదయం డిజైనర్ రాల్ఫ్ లారెన్ ట్వీట్ చేస్తూ ‘ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లకు వివాహ శుభాకాంక్షలు. మీ దంపతులకు, పెళ్లి వేడుకకు హాజరైన వారందరికీ డ్రెస్సులు డిజైన్ చేసే అవకాశం ఇవ్వడం రాల్ఫ్ లారెన్ కి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.’ అని పేర్కొంది.

ఈ పెళ్లి వేడుక జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ లో జరిగింది. దీనికి నిక్ తండ్రి పాల్ కెవిన్ సీనియర్ పెళ్లి పెద్దగా వ్యవహరించినట్టు పీపుల్ మేగజైన్ తెలిపింది. రేపు ప్రియాంక, నిక్ జంట హిందూ సంప్రదాయంలో రెండోసారి పెళ్లాడనుంది.