హీరోలను కించ పరిచే విధంగా నటించను!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా వెలుగొందుతోన్న నటుడు పృథ్వి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమా ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సత్తిబాబు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సందర్భంగా.. పృథ్వి సోమవారం విలేకర్లతో ముచ్చటించారు.
”నేను అనుకున్న దానికంటే దర్శకుడు సత్తిబాబు నా పాత్రను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యత ఉన్నా.. నేను మాత్రం హీరోను కాదు. ఈ సినిమాలో సలోని నాకు జంటగా నటించింది. మా ఇద్దరి మధ్య ఓ పాట కూడా ఉంటుంది. డాన్స్ మాస్టర్ ఆ పాటకు నాతో స్టెప్పులు కూడా వేయించాడు. హాస్య నటుడిగా ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతం కాదు. ప్రతి శుక్రవారం ఓ కొత్త నటుడు వస్తూనే ఉంటాడు. ఉన్నంత వరకు అందరితో కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశ్యం. నేను చేసే పేరడీ పాత్రలు హీరోలు ఆనందిస్తున్నారు. వారిని కించ పరిచే విధంగా ఎప్పటికీ నటించను. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమాలో హీరోయిన్ బాబాయ్ గా నటిస్తున్నాను. అలానే సాయి ధరమ్ తేజ్ చేస్తోన్న విన్నర్, వరుణ్ తేజ్ ‘మిస్టర్’, ద్వారక, వైశాఖం అలానే నాని కొత్త సినిమాలో నటిస్తున్నాను. వీటితో పాటు తెలంగాణ నేపథ్యంలో ‘మల్లప్ప’ అనే పేరుతో సినిమా చేయబోతున్నాను. కర్రసాముతో ఆరితేరిన ఓ పోరాట యోధుడి కథాంశంతో కూడిన కథ” అన్నారు.