మీడియాకు పూరి ఛాలెంజ్!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. ఇప్పటివరకు పన్నెండు మంది పేర్లు బయటకు రాగా, వారిలో చాలా మంది తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బయటకు రాని పేర్లు కూడా చాలానే ఉన్నాయి. ఆ పేర్లు బయటకు రాకపోవడానికి కారణం ఏంటి..? ఎవరెవరికి ఈ డ్రగ్ కేసుతో సంబంధం ఉందనే..? ఆసక్తి నెలకొంది. తాజాగా పూరి జగన్నాథ్ ఈ విషయంపై స్పందించాడు. ”డ్రగ్స్ విషయంలో చాలా మందికి లింకులు ఉన్నాయి. వాళ్ళ పేర్లు చెప్పగలిగే దమ్ము నాకుంది. రాసే ధైర్యం మీకుందా..?” అంటూ మీడియాకు ఛాలెంజ్ విసిరాడు. పూరి పేరు ఎప్పుడైతే డ్రగ్స్ వివాదంలో బయటపడిందో.. అప్పటినుండి అతడిని సంప్రదించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంతో పూరి స్పందించలేదు. ఎట్టకేలకు ఆయన ఫోన్ ద్వారా కొంతమందితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కొందరు పేర్లను వెల్లడించినట్లు సమాచారం. ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన వారసుడికి కూడా ఈ కేసు సంబంధం ఉందని తెలుస్తోంది. అలానే నిర్మాత కుమారులు ఉన్నారని సమాచారం. పూరి ఈరోజు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తునాయి. కొన్ని పేర్లను వెల్లడించే ఛాన్సులు లేకపోలేదు. అలానే పోలీస్ శాఖ ఈరోజు రెండో లిస్ట్ ను విడుదల చేయనున్నారని టాక్. మరి ఆ లిస్ట్ లో పూరి చెప్పబోయే పేర్లు ఉంటాయేమో చూడాలి!