లక్ష్మీబాంబ్‌ ప్రాజెక్టులో రాఘవ లారెన్స్‌కు ఏమైంది?

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కాంచన మూవీని హీందీలో లక్ష్మీబాంబ్‌ పేరుతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. లక్ష్మీ బాంబ్‌ చిత్రానికి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదలైంది. అయితే ఈ ప్రాజెక్టులో తనకు అవమానం జరిగిందని, ఇలాంటి ఘటన ఏ దర్శకుడికీ జరగకూడదంటూ బాధపడుతున్నారు, మర్యాద లేని చోట నేనుండలేనంటూ బయటికి వచ్చేశాడు. ఈ సినిమా నుంచి తాను తప్పుకొన్నట్లు రాఘవ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదని తమిళంలో ఓ సామెత ఉంది. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే లక్ష్మీబాంబ్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నేను కారణం చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఒకటి. నా అనుమతి లేకుండా నాతో చర్చించకుండా పోస్టర్‌ను విడుదల చేసేశారు. ఇలా చేశారని నాకు మూడో వ్యక్తి ద్వారా తెలిసింది. ఓ దర్శకుడిగా ఇది ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు తెలుసు. నాకు పోస్టర్‌ డిజైన్‌ కూడా నచ్చలేదు. ఇది నా సినిమాకు రీమేక్‌ కాబట్టి నేను స్క్రిప్ట్‌ను కూడా వెనక్కి ఇచ్చేయాలని అడగను. అలాగని ఈ సినిమాకు దర్శకుడిగా కొనసాగలేను, వారికి నచ్చిన దర్శకుడిని ఎంచుకోవచ్చు అని వెల్లడించారు.