మోడిజీని నిద్ర లేపాం: రాహుల్‌ గాంధీ


ప్రధానమంత్రి నరేంద్రమోడిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. 99 శాతం వస్తువులను 18 శాతం అంతకన్నా తక్కువ శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రధాని మోడి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాహుల్‌.. “ఎట్టకేలకు మోడిని నిద్ర మత్తు నుంచి లేపగలిగాం” అంటూ ఎద్దేవా చేశారు.

“గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌పై గాఢ నిద్రలో ఉన్న మోడిజీని ఎట్టకేలకు లేపగలిగాం. అయినప్పటికీ ఇంకా కాస్త మగతలో ఉన్నట్లున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనలను “గ్రాండ్‌ స్టుపిడ్‌ థాట్స్‌” అంటూ విమర్శించిన ఆయనే ఇప్పుడు వాటిని అమలు చేయాలనుకుంటున్నారు. అసలు చేయకపోవడం కంటే ఆలస్యంగానైనా చేయడం మంచిదే నరేంద్ర జీ..!” అని రాహుల్‌ ట్వీట్‌ ద్వారా విమర్శించారు.

వస్తు సేవల పన్నును(జీఎస్‌టీ) అమల్లోకి తెచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. జీఎస్‌టీని “గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌” అంటూ రాహుల్‌ పలుమార్లు దుయ్యబట్టారు. జీఎస్‌టీలో అధిక పన్ను రేట్లు ఉన్నాయని, 28 శాతం శ్లాబును తీసేసి, 18 శాతం వరకే ఉంచాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్‌ విమర్శలను తిప్పికొట్టడంలో భాగంగా ఆ పార్టీ జీఎస్‌టీపై “గ్రాండ్‌ స్టుపిడ్‌ థాట్స్‌”ను ప్రచారం చేస్తోందని ప్రధాని మోడి దుయ్యబట్టారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ముంబయిలో జరిగిన “ఉత్తుంగ భారత్‌” సదస్సులో పాల్గొన్న మోదీ జీఎస్‌టీ గురించి ప్రస్తావించారు. 99 శాతం వస్తువులను 18 శాతం, అంతకన్నా తక్కువ శాతాల శ్లాబుల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. కేవలం విలాసవంతమైన వస్తువులనే గరిష్ఠ శ్లాబ్‌ అయిన 28%లో ఉంచనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ పై విధంగా విమర్శలు చేశారు.