షాక్‌లో రాజమౌళి.. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పిక్స్‌ లీక్‌..

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి లీక్‌ల బెడద మొదలైంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పిక్స్ నెట్‌లో లీక్ అయ్యాయి. రాజమౌళి ఈ సినిమా ని అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ చిత్రంపై క్రేజ్ దృష్ట్యా రకరకాల రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇటీవల ఈ చిత్ర కథకు సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. వాటిలో ఆర్ ఆర్ ఆర్ కథ.. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు అంటే 1940 బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని.. ఎన్టీఆర్ ఒక బందిపోటుగా కనిపిస్తారని, రామ్ చరణ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అధికారిగా ఉంటారని రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా లీక్ అయిన షూటింగ్ ఫొటోలు ఈ రూమర్స్‌కి బలాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో రామ్ చరణ్‌పై భారీ యాక్షన్ సీన్లు రూపొందిస్తున్నారు. తాజాగా లీక్ అయిన ఫొటోలలో రామ్ చరణ్ పోలీస్ అధికారిగా ఉండటం.. బ్రిటీష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ సెట్.. ఆ పోలీస్ స్టేషన్‌కు ‘అనంగ్ పూర్ పోలీస్ స్టేషన్’ అని ఉండటం.. దానిపై బ్రిటీష్ జెండా కనిపిస్తుండటాన్ని బట్టి ఈ చిత్ర కథ 1940 నాటిదే అంటూ వస్తున్న రూమర్స్ నిజమే అన్నట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ లొకేషన్‌కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఈ రెండో షెడ్యూల్‌లో తమిళ నటుడు సముద్రఖని కూడా జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, కీర్తి సురేశ్, ప్రియమణి, అదితిరావు హైదరి పేర్లు వినపడుతున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.