దర్బార్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. ప్రస్తుతం తొలిషెడ్యూల్‌ చిత్రీకరణ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

ఒకటి పోలీసు అధికారి పాత్రలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఓ సన్నివేశాన్ని కూడా ఇటీవల తెరకెక్కించినట్టు సమాచారం. ఈనెలాఖరులో తొలిషెడ్యూల్‌ పూర్తికానుందని తెలుస్తోంది. కొంత విరామం తర్వాత రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా ముంబయి చిత్రీకరణలో పాల్గొన్న రజనీకాంత్‌ తన సహ నటులు, సాంకేతిక కళాకారులతో కలిసి భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాకుండా సెట్‌లో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు కూడా ఇచ్చారు.