డాన్స్‌తో అదరగొట్టిన రకుల్‌..!

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ భామ తాజాగా సోషల్‌మీడియాలో డ్యాన్స్‌ సాధన చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. అందులో ఆమె కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌ నటించిన ‘చమ్మా చమ్మా’ గీతానికి రకుల్‌ చిందులేశారు. ‘మీ ప్రయాణంలో ఎక్కువ అవకాశాలు తీసుకోండి.. ఎక్కువగా డ్యాన్స్‌ చేయండి.. ధన్యవాదాలు గుల్నాజ్‌ ఖాన్, అంకన్‌ సేన్‌. ఓ రోజు నేనూ మీలాగా చక్కగా డ్యాన్స్‌ చేయగలుగుతానని ఆశిస్తున్నా.. అప్పటి వరకూ నేర్చుకుంటూనే ఉంటా’ అని ఆమె పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోను గుల్నాజ్‌ ఖాన్‌ కూడా షేర్‌ చేశారు. ‘చక్కగా చేస్తున్నావు రకుల్‌.. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది’ అని పేర్కొన్నారు. రకుల్‌ డ్యాన్స్‌ వీడియోకు మంచి స్పందన లభించింది. ఆరు లక్షల మందికిపైగా దీన్ని వీక్షించారు. రకుల్‌ స్టెప్పులు అద్భుతంగా వేశారని ప్రశంసించారు.

రకుల్‌ తెలుగులో ప్రస్తుతం ‘యన్‌.టి.ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె శ్రీదేవి పాత్రలో కనిపించనున్నారు. శివ కార్తికేయన్‌కు జోడీగా ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. హిందీలో ‘దే దే ప్యార్ దే’, ‘మర్జావాన్‌’ సినిమాల్లో సందడి చేయనున్నారు.