రివ్యూ: గరుడ వేగ

హీరోగా వరుస పరాజయాలు చూస్తోన్న రాజశేఖర్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ‘గరుడ వేగ’ సినిమాలో హీరోగా నటించాడు. భిన్న కథలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అందుకున్నాడో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
ఎన్‌ఐ‌ఏ లో అధికారిగా పని చేస్తుంటాడు చంద్రశేఖర్(రాజశేఖర్). పని మీద ఉన్న ఇష్టంతో ఇంట్లో వారిని కూడా పట్టించుకోడు. దీంతో శేఖర్ భార్య స్వాతి(పూజా కుమార్) అతడి నుండి విడాకులు కోరుకుంటుంది. దీంతో తన ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకుంటాడు. ఈలోగా నిరంజన్(అదిత్) అనే వ్యక్తిని ప్రొఫెషనల్ షూటర్ చంపాలనుకోవడం శేఖర్ కు తెలుస్తోంది. దీంతో వారిని పట్టుకోవడానికి బయలుదేరతాడు శేఖర్. ఆ షూటర్ ఎవరు..? నిరంజన్ ను ఎందుకు చంపాలనుకుంటాడు..? ఈ మిస్టరీను చెందించే క్రమంలో శేఖర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
నేరాలను కనిపెట్టి వాటి అరికట్టడానికి స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించడం ఎన్‌ఐ‌ఏ బాధ్యత. ఈ క్రమంలో వారికి నిరంజన్ అనే వ్యక్తి రూపంలో ఓ పెద్ద స్కామ్ జరగనుందని తెలుస్తోంది. దాన్ని ఎలా అరికట్టారనేదే కథలో మెయిన్ పాయింట్. కథ మొత్తం కూడా నిరంజన్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా మొదటి భాగంలో వచ్చే బైక్ ఛేజింగ్, డ్యామ్ దగ్గర గల షిప్ ను అంతం చేసే సన్నివేశాలను సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.

ఇంటర్వల్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ కాస్త స్లో గా నడిచింది. ఆ స్కామ్ ఏంటని వివరించే సన్నివేశాలు సాధారణ ప్రేక్షకుడికి అర్ధమవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు పరమ రొటీన్. ఇక శేఖర్ కు అతడి భార్య మధ్య వచ్చే ట్రాక్ బాగా విసిగిస్తుంది. కామెడీకు కథలో ఎక్కాడా.. స్కోప్ లేదు. అయితే టేకింగ్ పరంగా దర్శకుడి పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే.

పలు సన్నివేశాలను చాలా ప్రభావవంతంగా చూపించారు. రాజశేఖర్ తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే
యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం రాజశేఖర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఉన్నంతలో ఓకే అనిపించారు. పూజా కుమార్, శ్రద్ధాదాస్ ల పాత్రలు పెద్దగా ఆకట్టుకోవు. హీరో క్యారెక్టర్ తో సినిమా మొత్తం ఉండే రవివర్మ, చరణ్ దీప్ ల పాత్రలు ఆకట్టుకుంటాయి. అలీ, పృధ్వీ వంటి వారు ఉన్నా కామెడీ పెద్దగా పండలేదు.

టెక్నికల్ గా సినిమా హైరేంజ్ లో ఉంది. కెమెరా పనితనం చాలా రిచ్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది. ఎడిటింగ్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సివుంది. మొత్తానికి మాస్ ఆడియన్స్ కు సినిమా పెద్దగా నచ్చనప్పటికీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను మాత్రం ఓ మేరకు సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్: 2.75/5