పవన్‌ను ఉద్దేశించి ఈ పుస్తకం రాయలేదు: రేణు దేశాయ్‌

పవర్‌ స్టార్‌, తన మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ పుస్తకం రాయలేదని అంటున్నారు నటి రేణూ దేశాయ్‌. ‘ఎ లవ్‌ అన్‌ కండీషనల్‌’ అనే పుస్తకాన్ని రేణూ రాశారు. ఇటీవల ఈ పుస్తకం విడుదలైంది. మంచి స్పందన కూడా వస్తోంది. అయితే పుస్తకం మొత్తం పవన్‌ను ఉద్దేశిస్తూ రాశారంటూ కామెంట్లు వస్తున్నాయట. ఈ విషయం గురించి ఇటీవల తెలుగు వర్షన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో స్పందించారు.

‘నేను పవన్‌ను ఉద్దేశిస్తూ ఈ పుస్తకాన్ని రాయలేదు. ఇందులో ఎలాంటి వివాదాస్పద అంశాలను ప్రస్తావించలేదు. పవన్‌ను మనసులో పెట్టుకునే నేను రొమాన్స్‌, సంతోషం, బాధల గురించి వివరిస్తూ పద్యాలు రాశానని అంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఆయన ఒకప్పుడు నా భర్త అన్న మాట నిజమే. ఆయన్ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నా నాకు ఇవే ఫీలింగ్స్‌ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ ఫీలింగ్స్‌ ఉండటం సహజమే’ అని క్లారిటీ ఇచ్చారు రేణు.

ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్‌ అనువదించారు. రేణుకు పుస్తకాలు, నవలల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. ఎక్కువగా ఇంగ్లిష్‌ సాహిత్యానికి సంబంధించిన పద్యాలను రాస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు.