వధువు పారిపోయి నాకోసం వచ్చింది: బాలీవుడ్‌ హీరో

బాలీవుడ్‌ నటుడు విక్రాంత్‌ మస్సేకు వింత అనుభవం ఎదురైందట. చిత్రీకరణ సమయంలో ఓ వధువు పెళ్లి మండపం నుంచి పారిపోయి తన కోసం సెట్స్‌కు వచ్చిందట. ఈ విషయాన్ని విక్రాంత్‌ ఓ ఆంగ్ల మీడియా ద్వారా వెల్లడించారు.

‘నేను, దీపిక పదుకొణె ‘ఛపాక్‌’ చిత్రీకరణతో బిజీగా ఉన్నాం. జూన్‌ 6న ఢిల్లీలోని సకెట్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరుగుతోంది. అయితే ఓ వధువు ఒంటి నిండా నగలతో సెట్స్‌లోకి ప్రవేశించింది. ఆమె తీరు చూస్తే పెళ్లి మండపం నుంచి పారిపోయి వచ్చినట్లుగా అనిపించింది.’

‘నన్ను కలవాలంటూ ఏడ్చి గొడవ చేసింది. షూటింగ్‌ జరుగుతుండడంతో ఇప్పుడు కుదరదని చిత్రబృందం ఆమెకు నచ్చజెప్పింది. అయినా ఆమె వినిపించుకోలేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అరిచింది. ఇక చేసేదేంలేక నేను వెళ్లి ఆమెను కలిసి నచ్చజెప్పాను. కానీ తను వినలేదు. దీంతో సెట్స్‌లో ఉన్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆ ఘటన నన్ను షాక్‌కు గురిచేసింది. ఎలా స్పందించాలో అర్థంకాలేదు. ఈ గొడవ కారణంగా చిత్రీకరణ నాలుగు గంటల పాటు ఆగిపోయింది’ అని వెల్లడించారు విక్రాంత్‌.

ఢిల్లీకి చెందిన యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితాధారంగా ‘ఛపాక్‌’ సినిమాను మేఘనా గుల్జార్‌ తెరకెక్కించారు. 2020 జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.