డిసెంబరు 16న సైనా పెళ్లంట!

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌.. సహచర క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను పెళ్లాడబోతున్నట్లు ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. డిసెంబరు 16న వీరి పెళ్లి జరగనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సైనా, కశ్యప్‌ మాత్రం తమ వివాహం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు సైనా తన పెళ్లి గురించి స్పందించింది. కశ్యప్‌ను డిసెంబరు 16న పెళ్లాడబోతున్న విషయం నిజమేనని మీడియాకు వెల్లడించింది. ఆ తేదీనే పెళ్లి కోసం ఎంచుకోవడానికి కూడా ఆమె కారణం చెప్పింది. ‘డిసెంబరు 20 తర్వాత పీబీఎల్‌తో నాకు తీరిక ఉండదు. తర్వాత టోక్యో ఒలింపిక్స్‌ అర్హత పోటీలు మొదలవుతాయి. అందుకే నేను పెళ్లి చేసుకోవడానికి ఈ తేదీనే సరైందనుకున్నా’ అని సైనా తెలిపింది.


తమ ఇద్దరికీ పదేళ్ల నుంచి స్నేహం ఉన్నప్పటికీ త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని సైనా చెప్పింది. ‘టోర్నీలు గెలవడం చాలా ముఖ్యం. అందుకే మా దృష్టి మరలిపోకుండా ఉండేందుకు వెంటనే పెళ్లి వద్దనుకున్నాం. క్రీడాకారుల్ని ఇంట్లోవాళ్లు పిల్లల్లాగే చూడాలి. నాకు ఇంట్లో అన్నీ అడక్కుండానే లభిస్తాయి. కానీ పెళ్లయితే ఇదంతా మారిపోతుంది. నేను చేసే అన్ని పనులకూ నేనే బాధ్యురాలిని. ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల ముందు కూడా హడావుడి ఉండొద్దనుకున్నా. ఇవన్నీ ముగిసి మా వ్యవహారాలు మేమే చక్కదిద్దుకోగలం అనుకున్నాక పెళ్లికి సిద్ధమయ్యాం’ అని ఆమె తెలిపింది. తన సాధనలో కశ్యప్‌ తోడ్పాటు చాలా ఉంటుందని సైనా చెప్పింది. ‘మేం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సాగుతాం. అతను తరచుగానే టోర్నీలు ఆడుతుంటాడు. ఐతే ఇప్పుడు నాకు సాయం చేయడంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు’ అని పేర్కొంది.