సన్నీలియోను

“అసలు చంపేసింది సినిమా.. ఇలా ఉండాలి.. డీమానిటైజేషన్ లో కూడా ఇరగాడేస్తుంది, ఇండియా పరువు నిలపెడతాది” అని వాడిలో వాడు మాట్లాడేసుకుంటున్న కనకాంబరాన్ని చూసి ఏమైందిరా అంటూ కదిపాడు ఏకాంబరం.

కనకాంబరం : ఏమైందాంటావేంట్రా..  అమీరుకాను సినిమా అదిరిపోయిందిరా.. ఇండియా సినిమాలు బాగుంటాయి అని ప్రపంచం అంతా తెలిసేలా చేసాడు మన అమీరుకాను.

ఏకాంబరం : అవునవును, ఇండియాలో బతకాలంటే భయంగా ఉంది అని చెప్పి అప్పట్లో కూడా తెలిసేలా చేసాడు ప్రపంచానికి..

కనకాంబరం : తర్వాత సారీ చెప్పాడు కదరా… కానీ ఏమాటకామాట సినిమా మాత్రం సూపరురా.. చాలా బాగుంది. మనోడు పెర్‌ఫెక్షనిస్ట్‌రా !!

ఏకాంబరం : పెర్‌ఫెక్షనిస్టు, పెప్సోడెంటు పేస్టు కాదురా.. అసలు డైరెక్టరు పేరు ఎంత మందికి తెలిసిందిరా?? ప్రతోడూ నీలానే అమీర్ సూపరు సూపరు అనేవాళ్ళే అంతా!!

కనకాంబరం : నీకు అర్థమయేలా చెప్పలేను కానీ.. బాలీవుడ్ లో చూసావా?? రీమిక్సు సాంగ్స్ కుమ్మేస్తున్నాయ్.

ఏకాంబరం : ఏమేం రీమిక్సు చేసేరేంటి??

కనకాంబరం : లైలా లైలా అనే పాత పాటని సన్నీలియోన్ మీద తీసారు. జనం భీభత్సంగా చూసేసారు ఆ పాటని 43 మిలియన్లు మంది.

ఏకాంబరం : ఆ సినిమా పేరేంటో చెప్పరా?? పోనీ హీరో ఎవరో తెలుసా??

కనకాంబరం : హీరో షారూఖు.

ఏకాంబరం : మరి ట్రైలరు చూసారా అంత మంది జనం.

కనకాంబరం : లేదురా..

ఏకాంబరం : అది మరీ.. సన్నీలియోను గుడికి వెళ్తున్న వీడియో పెట్టినా ఇలానే చూస్తారు. అంతే కానీ షారుఖ్ ఖాన్ సినిమా అనో, పాట బాగుంది అనో ఎవరూ చూడరిక్కడ.

కనకాంబరం : నీకు చెప్పలేంరా బాబూ.. పోనీ అదొదిలెయ్.. హమ్మ హమ్మ పాట కూడా రీమిక్సు చేసారు, అదికూడా హిట్టు తెలుసా??

ఏకాంబరం : అదిప్పుడేంటి, ఎపుడో ఇరవైయేళ్ళ కిందటే హిట్టు అందుకే మళ్ళీ చేసారు.

కనకాబరం : అబ్బా!!! ఎంత మంది చూసారో తెలుసా??

ఏకాంబరం : చూస్తారు, శ్రధ్ధా కపూర్ అలా షర్టుకి రెండే బటన్లు పెట్టుకుని డాన్సు చేస్తే చూడకేం చేస్తారు.

కనకాంబరం : జనానికి నచ్చే విధంగా తియ్యాలి కదరా మరి.

ఏకాంబరం : ఇపుడేం అంటావ్ ఐతే. ??

కనకాంబరం : నువ్వు కూడా ఆ రెండు పాటలు చూడు, చాలా బాగున్నాయ్..

ఏకాంబరం : చూస్తానులే, నువ్వు అంతలా ఏడవకు కళ్ళు తుడుచుకో !!   

— V.K