చెంపచెళ్లుమనిపించిన సల్మాన్‌ ఖాన్‌.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన బాడీగార్డు చెంపచెళ్లుమనిపించారు. తన ఫ్యాన్‌ అయిన ఓ బాలుడితో దురుసుగా ప్రవర్తించడం పట్ల సల్లూభాయ్‌ బాడీగార్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చుట్టూ ఉండగానే అతడిని కొట్టారు. మంగళవారం రాత్రి ముంబయిలో ‘భారత్’ సినిమా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ సల్మాన్‌ను చూసేందుకు అభిమానులు చేరుకున్నారు. షో పూర్తవగానే బయటికి వచ్చిన సల్మాన్‌ అందరికీ అభివాదం చేసుకుంటూ కారు ఎక్కబోయారు. ఈ క్రమంలో ఆయన బాడీగార్డు సల్మాన్‌ను దారి ఏర్పరిచే క్రమంలో ఓ బాలుడ్ని పక్కకు నెట్టారు. కనీసం అతడ్ని పైకి కూడా లేపలేదు. దీంతో ఆగ్రహించిన సల్లూభాయ్‌ అతడి చెంపచెళ్లుమనిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఇది ఫ్యాన్స్‌పై సల్మాన్‌కు ఉన్న ప్రేమ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్‌కు చిన్నారులంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. పలు సంద్భాల్లో ఆయన వీధిలోని పిల్లలతో, షూటింగ్‌ సెట్‌లోని చిన్నారులతో కలిసి సరదాగా సమయం గడిపిన ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి.

బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ‘భారత్’ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ సినిమా చక్కటి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విమర్శకులు అంచనా వేశారు. కత్రినా కైఫ్‌, దిశా పటానీ హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు.