ఘాజీ దర్శకుడితో మెగాహీరో..?

రానా ప్రధాన పాత్రలో సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో రూపొందించిన ‘ఘాజీ’ చిత్రంతో పరిచయమయిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి. మొదటి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఈ దర్శకుడు తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజా సమాచారం ప్రకారం సంకల్ప్ తన తదుపరి సినిమాను మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 
 
మొదటి నుండి కూడా భిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోన్న వరుణ్ తేజ్ ఇటీవల వచ్చిన ‘మిస్టర్’ సినిమా ఫ్లాప్ టాక్ తో డీలా పడ్డాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న ఫిదా సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు సంకల్ప్ ప్రాజెక్ట్ కూడా వరుణ్ కి వెళ్ళడం మంచి విషయమనే చెప్పాలి. వరుణ్, వెంకీ అట్లూరి అనే మరో కొత్త దర్శకుడితో కూడా పని చేయనున్నాడు. అయితే ముందుగా ఎవరి ప్రాజెక్ట్ మొదలు పెడతాడో.. చూడాలి!