అలనాటి సంక్రాంతిని గుర్తుచేసుకుందాం

తెలుగు వారి లోగిళ్లలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు వైభవంగా జరుపుకునే సంక్రాంతి వచ్చిదంటే చాలు పల్లెటూళ్లలో ఉన్నంత సరదా ఇక ఎక్కడా ఉండదు. అందుకే ఎంత దూరాన ఉన్నా కుటుంబ సభ్యులంతా సంక్రాంతి పండుగకు సొంతూరుకు చేరుకుంటారు. రైతన్నల ఇళ్లన్నీ ధాన్యరాశులతో కళకళలాడుతూ పాడి పశువుల ముస్తాబులతో, రంగవల్లులతో, కొత్త బట్టలతో, కొత్త అళ్లుళ్లతో, పిండి వంటలతో, బావామరదళ్ల సరదాలు, కోడిపందాలు, కొత్త సినిమాలతో పాటు పల్లెటూర్లలో జానపద కళలు కనిపించి మురిపిస్తాయి. ఒకప్పుడు మన సంస్కృతిలో భాగమైన రకరకరాల జానపదులు, కళా రూపాలను పల్లెల్లో ప్రదర్శించి, తృణమోపణమో తీసుకుని సంతోషంగా జీవించేవారు. కానీ ఆధునిక కాలంలో ఆనాటి కళలు చిక్కిశల్యమై పోతున్నాయి. నాటి కళాకారులను, ఆనాటి కళలను అక్కున జేర్చుకుని మన పిల్లలకు పరిచయం చేసి, మనవైన మూలాలను పదిలంగా దాచుకుందాం.

సంక్రాంతికి నెలరోజుల ముందుగానే హరిదాసులు తన కీర్తనలతో ఊరంతా సందడి చేస్తూ… వచ్చేసింది మన సంక్రాంతి అని గుర్తు చేస్తారు. మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరా ధరించి “హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి” అంటూ శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ వీధుల్లో సందడి చేస్తారు. రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా ఆలంకరిస్తారు. గుడ్డిబూరలూ, కోణంగి బుడ్డాళ్లతో సహా.. ఇంటింటికీ వచ్చి “అయ్యవారికీ దండం పెట్టూ..” అంటూ తమకు చిల్లర పైసలూ, ఎద్దుకు బుట్టెడు వడ్లూ అడుగుతూ.. సంక్రాంతి పండుగకే కళ తెచ్చే గంగిరెద్దుల వాళ్ల సందడి అంతా ఇంతా కాదు.

పాత గొడుగు వేసుకుని.. బుస్కోటు తొడుక్కుని.. బుడబుడక్‌ అంటూ డమరుకం వాయిస్తూ.. అంబ పలుకులతో ఇంటింటి భవిష్యవాణిని వినిపించే బుడబుక్కల స్వాములు.. నీళ్లు నింపిన కడవ మూతిలో కత్తిగుచ్చి, దాన్ని ఓ కావిడికి కట్టి ఊరంతా ఊరేగించి కనికట్టుతో అందర్నీ ఆకట్టుకునే మాసాబత్తినవాళ్లు.. చిన్న సంచికట్టుతో, విభూతి నామాలతో గడపలో తిష్టవేసి కనికట్టు, హస్తలాఘవం వంటి విద్యలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ వినోదం అందించే వారు. రోజుకో వేషం వేసుకుని, హాస్యం, భయంతో సహా సకల రసాలనూ పలికిస్తూ.. ఆఖరి రోజు శక్తివేషంతో ఊరంతటినీ ఉరికించి, వినోదం అందించే పగటి భాగవతులు.. ఎత్తైన చెట్టు కొమ్మ మీద కూచుని.. కనిపించిన మేర దృశ్యాలను తన దైన వ్యంగ్య ధోరణిలో ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పే కొమ్మదాసరిలు… ఇంటింటికీ తిరిగి సకల కులాల వారికీ తాతముత్తాల నుంచి గోత్రాల వరకూ.. పాటల రూపంలోనే వంశ మూలాలన్నీ విప్పి చెప్పే పిచ్చికుంట్లవారు. తలపై పెద్ద కిరీటం, చేతిలో గంట, నుదుటిపై విభూది పట్టీలు, మెడలో శంఖంతో వచ్చి.. గంట నిండా ధాన్యం పెట్టమంటూ శుభోదయం పలికే జంగం దేవర…

భుజాన కావిడి, కావిడి బద్ద పొడుగునా గొట్టంతో వచ్చి, గొట్టం విప్పితే ఏయే తప్పులకు నరకంలో ఏయే శిక్షలో కళ్లకు కట్టిచెప్పే.. జనం ఇచ్చే సంభావనలు స్వీకరించే కాశీ బ్రాహ్మడు… నెమలీకలు తలకు కట్టుకుని.. గంభీరమైన వేషధారణలో పాట పాడుతూ.. కంచు శిబ్బెని మోగిస్తూ, శివయ్యను స్మరించే చెంచు దొరలు.. ఒకప్పుడు ఊళ్లోకి ప్రవేశం లేక.. ఊరి పొలిమేర నుంచే ప్రత్యేక వాద్యం వాయిస్తూ పాటలు పాడే డొక్కల వారు.. కోసిన కోత కొయ్యకుండా వసపిట్టలా బడాయి కబుర్లు చెబుతూ ఆబాల గోపాలాన్నీ ఆనందపరిచే పిట్టల దొరలు… గవ్వలతో కుట్టిన గొంగడి టోపీ ధరించి.. ఒంటికి గొంగడి వస్త్రాన్ని కప్పుకుని, పిల్లన గ్రోవి వాయిస్తూ భిక్షమెత్తుకునే గొరవయ్యలు.. కనకదుర్గమ్మ పెట్టెతో, కొరఢా ఝళిపిస్తూ, ఒంటిని కొరఢాతో బాదుకుంటూ, వీధి మధ్యలో డోలు వాయిస్తూ సందడి చేసే పోతరాజులు… కాటికాపర్లు.. కోతులు ఆడించేవారు.. ఎలుగును తెచ్చేవారు… ఇలా అనేకానేక వృత్తుల వారు, జానపదులు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి పల్లెలోనూ సందడి చేసేవారు. ఇవన్నీ ఒకనాటి ముచ్చట్లు.

గ్రామాలన్నీ పట్టణాలకు తరలిపోతున్నాయి. పల్లెజీవి పట్టణ వాతావరణానికి అలవాటు పడటంతో.. నాటి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కనుమరుగై పోతున్నాయి. సంక్రాంతి అంటే ఇవన్నీ ఉంటాయని తెలిస్తే మన పిల్లలు కూడా గంతులేస్తూ పల్లెలకు పరుగెత్తుతారు. మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆనాటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.