నా కెరీర్‌లో నేను అత్యధిక ఒత్తిడికి గురైన కాలం బిగ్‌బాస్‌: నాని

నేచురల్‌ స్టార్‌ నాని.. తనకు ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో నిజమైన ప్రపంచాన్ని పరిచయం చేసింది అని అన్నారు. ఆయన ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌ 2కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇటీవల సీజన్‌ 2 పూర్తయింది. నటుడు కౌశల్ విజేతగా నిలిచి, టైటిల్‌ గెలుచుకున్నారు. అయితే ఈ షో కోసం తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించడం గురించి నాని ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. తన భావాలను పంచుకున్నారు. ‘బిగ్‌బాస్‌’.. నేను ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చింది. ఈ షోకు వ్యాఖ్యాతగా చేయకముందు నేను ఓ చిన్న ప్రపంచంలో జీవించేవాడ్ని. నిజమైన ప్రపంచం చాలా సంతోషంగా ఉంటుందని అనుకునేవాడ్ని. కానీ ఈ ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉంటారని ‘బిగ్‌బాస్‌’ వల్ల బాగా తెలిసింది. కొందరు తీర్పులు కూడా ఇస్తుంటారు. ఈ షో నన్ను నిజమైన ప్రపంచానికి పరిచయం చేసింది’.

‘జీవితంలో నాకెప్పుడూ ఇన్ని విద్వేషపూరితమైన సందేశాలు రాలేదు. ప్రపంచంలోని అందర్నీ మెప్పించలేమని ఈ షో వల్ల నాకు అర్థమైంది. మనల్ని ఇష్టపడని వారు కూడా ఉంటారు. అలాంటి వారిని మనం ఏం చేయలేం’. ‘గత మూడు నెలలు నా కెరీర్‌లో నేను అత్యధిక ఒత్తిడికి గురైన కాలం. సంవత్సరానికి మూడు సినిమాలు చేసినప్పుడు కూడా కనీసం రెండు వారాలు (సాధారణ వీకెండ్‌ బ్రేక్స్‌ కాకుండా) కుటుంబంతో సంతోషంగా గడిపేవాడిని. కానీ ‘బిగ్‌బాస్‌’కు నేను కేటాయించిన సమయం అనుకున్నదాని కంటే ఎక్కువైంది. ఈ మధ్యలోనే ‘దేవదాస్‌’ షూటింగ్‌లో పాల్గొన్నా. ఇప్పుడు చివరికి హాలిడే తీసుకునే సమయం వచ్చింది’ ఈ నెల18 వరుకు హాలిడే ఉంటుంది ఆ తర్వాత ‘జెర్సీ’ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాను అని నాని అన్నారు.