ఎండా వానలో ఓ గొడుగులా నిలిచావు: సుమలత

అలనాటి నటి సుమలత తన భర్త అంబరీశ్‌కు బరువెక్కిన హృదయంతో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు (శనివారం) తమ పెళ్లి రోజని సోషల్‌మీడియా వేదికగా ఆమె గుర్తు చేసుకున్నారు. 27 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత తొలిసారి పెళ్లిరోజున అంబరీశ్ తన పక్కన లేరని ఆవేదన చెందారు. ఈ మేరకు సుమలత వరుస ట్వీట్లు చేశారు. తన భర్తతో వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు.

‘నా ప్రియమైన అంబరీశ్‌.. డిసెంబరు 8.. మనకు ఎంతో ముఖ్యమైన ఈ రోజున తొలిసారి నువ్వు నా పక్కన లేవు.. నా ప్రపంచంలో నువ్వు ఓ కేంద్రం మాత్రమే కాదు.. నా పూర్తి ప్రపంచమే నువ్వు. నా చేయి పట్టుకుని నడిపించిన చేయి నీది.. నాకు అమితమైన ప్రేమను పంచిన హృదయం నీది. నువ్వు నన్ను ప్రేమించిన తర్వాతే నా జీవితం ప్రారంభమైంది. నువ్వు నవ్విన తర్వాతే నా జీవితంలోకి వెలుగు వచ్చింది. నీ ప్రేమ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది’.

‘నువ్వు ఎక్కడున్నప్పటికీ చలిలో నాకు వెచ్చదనం ఇచ్చావు, ఎండా వానలో ఓ గొడుగులా నిలిచావు. నువ్వు ఇంకా నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. మన కుమారుడి గురించి బాధపడుతుంటావని కూడా తెలుసు. ఇప్పుడు కూడా మా భద్రతను నువ్వే చూసుకుంటుంటావనీ తెలుసు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల కళ్లల్లో నీ ప్రేమ ప్రతిబింబిస్తోంది. వారి రూపంలో మమ్మల్ని నువ్వు ఆశీర్వదిస్తున్నావు. బద్దలైన ఈ హృదయాన్ని మార్చడానికి, ఇలానే మౌనంగా జీవించడానికి నాకు నీ బలం కావాలి. నీ జ్ఞాపకాలతో బతకడానికి ధైర్యం, ప్రేమ కావాలి.. అప్పుడే నేను జీవించగలను’.

‘నువ్వు ఇచ్చిన స్ఫూర్తితో, అద్భుతమైన వ్యక్తివైన నీతో 27 ఏళ్తు జీవితాన్ని పంచుకున్న ధీమాతో గర్వంగా ముందుకు సాగుతాను. నీలాంటి వారు లక్షల్లో ఒక్కరు ఉంటారు. నువ్వు నాతోనే ఎల్లప్పుడూ ఉండు. మాపై నీ ప్రేమను ఎల్లప్పుడూ కురిపించు. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ సుమలత ట్వీట్లు చేశారు.