Homeతెలుగు Newsనేరచరితులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

నేరచరితులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిల్ పై సుప్రీం ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. చార్జిషీట్‌ ఉన్నంత మాత్రాన ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించలేమని.. కేసులున్నా నిరూపితమై జైలు శిక్ష పడేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయొచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. నేరచరిత్ర కలిగినవారు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై న్యాయస్థానం అనర్హత వేటు వేయలేదని తెలిపింది. ఈ విషయంలో తాము లక్ష్మణరేఖ దాటలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగ సవరణ, కొత్త చట్టాలు తెస్తేనే, నేర చరితులను రాజకీయాలకు, ఎన్నికలకు దూరంగా ఉంచవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఎన్నికలను డబ్బు, మందబలం శాసిస్తున్నాయని కోర్ట్ వ్యాఖ్యానించింది. నేర చరితులను ఆస్తిగా నేతలు భావిస్తున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.

12 15

అయితే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా తమపై ఉన్న పెండింగ్ కేసులను తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థుల నేర చరిత్ర గురించి అఫిడవిట్‌లో పేర్కొనాలని సూచించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను, నేర చరిత్రను, పెండింగ్ కేసులను తమ పార్టీలకు అందజేయాలి. ప్రతి రాజకీయ పార్టీ తమ నేతల నేర చరిత్ర గురించి పార్టీ వెబ్‌సైట్‌లో కచ్చితంగా ఉంచాలని తెలిపింది. అదేవిధంగా స్థానిక పత్రికలు, ఛానెళ్ల ద్వారా కూడా ప్రచారం చేయాలని చెప్పింది. నేర చరిత్ర గల అభ్యర్థుల వివరాలను పారదర్శకంగా అందించటం వల్ల ఓటర్లు తగిన అవగాహనతో దీనివల్ల ఓటర్లు సరైన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం వీలవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేర చరిత్ర తెలుసుకోవడం ఓటర్లు హక్కని కోర్టు తెలిపింది. నేరచరితులకి టిక్కెట్టు కేటాయించరాదని.. పార్టీలకు ఎన్నికల కమిషన్ నేరుగా సూచించవచ్చనే సంకేతాలను ఇచ్చింది. వారు స్వతంత్రంగా పోటీ చేసుకునే వీలుందని అభిప్రాయపడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu