వర్మ ‘వెన్నుపోటు’ పై ఫిర్యాదు..!

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాంగోపాల్‌ వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ చిత్రానికి సంబంధించి వెన్నుపోటు పేరుతో ఓ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటపై ఎస్వీ మోహన్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాట తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అవమానించేవిధంగా ఉందని, ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా పాటను రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. (టీడీపీలో గుబులు పుట్టిస్తున్న వర్మ పాట)

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన విధంగా ఈ పాటలో సృష్టించారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. చంద్రబాబు కీర్తిప్రతిష్టలు దిగజార్చేవిధంగా చిత్రీకరించిన రాంగోపాల్‌ వర్మపై చర్యలు తీసుకోవాల్సిందిగా కర్నూలు టూటౌన్‌లో మోహన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు.