మాజీమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుంటూరులోని తెదేపా కార్యాలయానికి తన అనుచరుడి ద్వారా పంపించారు. టీడీపీ క్రియాశీల సభ్యత్వానికే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రావెల కిశోర్ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.
రైల్వే అధికారి అయిన రావెలకు గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్తిపాడు నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రావెల.. అనంతరం అనూహ్యంగా మంత్రిపదవిని దక్కించుకున్నారు. అయితే, తదనంతరం పార్టీలో, నియోజకవర్గంలో ఆయన పనితీరు పట్ల వ్యతిరేకత రావడంతో మంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పించారు. నాటి నుంచి రావెల అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తొలుత ఆయన పైసీపీలో చేరతారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆ పార్టీ అధినేత జగన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనసేనలో చేరాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు గత రెండు, మూడు దఫాలుగా పవన్‌తో సమావేశమై చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం గుంటూరులోని తన అనుచరులతో
సమావేశమై టీడీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ కార్యాలయానికి పంపించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన రేపు జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.