మమతతో కేసీఆర్‌ భేటీ.. త్వరలోనే ఫెడరల్ ఫ్రంట్ పూర్తి స్థాయి ప్రణాళిక

కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమి ఏర్పాటే తన మిషన్‌ అని, ఇందుకు సంబంధించి త్వరలోనే నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకొస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఒడిశా పర్యటన ముగించుకొని ఈ సాయంత్రం కోల్‌కతాకు చేరుకున్న కేసీఆర్‌.. సచివాలయంలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై ఆమెతో సమాలోచనలు జరిపారు. అనంతరం మమతతో కలిసి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాలపై తామిద్దరం చర్చించినట్టు ఆయన వెల్లడించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయని, ఇప్పటికే తాను ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయి చర్చించానన్నారు. త్వరలోనే పటిష్ట ప్రణాళికతో ముందుకొస్తామని, మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటు అంటే ఆదర బాదరాగా చేయాల్సింది కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘దీదీ (మమతా బెనర్జీ)తో చర్చలు ఎప్పుడూ సానుకూలంగానే జరుగుతాయి. మున్ముందు కూడా చర్చలు కొనసాగిన అనంతరం పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయి. దేశవ్యాప్తంగా పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఇది. ఇద్దరు నేతలు కలిసినప్పుడు సాధారణంగా పరస్పర ప్రయోజనాలు, జాతీయ రాజకీయాలు సహా అన్ని అంశాలపైనా చర్చ జరుగుతుంది. అతి త్వరలోనే నిర్మాణాత్మకమైన ప్రణాళికతో ముందుకు వస్తాం’ అని కేసీఆర్ తెలిపారు.

మీరు కాంగ్రెస్‌, బీజేపీయేతర కూటమిని అడుగుతున్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. ‘కేసీఆర్‌ మిషన్‌ అదే. ఇందుకోసం నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఇది ఇప్పటికిప్పుడు తీసుకొనేంత చిన్న విషయం కాదు. మేం చర్చలు కొనసాగిస్తాం. ఫలితం వస్తుంది. సమయం వచ్చే వరకు వేచిచూడాలి. త్వరలోనే కార్యాచరణ మొదలవుతుంది. మీకు శుభవార్త అందిస్తాం’ అని కేసీఆర్‌ తెలిపారు.

కోల్‌కతాలో కాళీమాత ఆలయాన్ని సందర్శించిన అనంతరం కేసీఆర్‌ దిల్లీకి పయనమవుతారు. రేపటి నుంచి రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్‌ దిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ ఆయన దిల్లీలో భేటీ కానున్నారు. దేశంలో భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే లక్ష్యంగా భావసారూప్యత కల్గిన రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.