ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు: జీవీఎల్‌

భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుపైకి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి చెప్పు విసిరి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి భార్గవ చేసిన ఈ పని దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆయన ఈ పని ఎందుకు చేశాడన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, ఆస్తుల కొనుగోలు, వెల్లడించని ఆదాయాల వివరాల విషయంలో కొంతకాలంగా ఆదాయపన్ను శాఖ నుంచి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన భార్గవ ఆస్పత్రితో పాటు పలు సంస్థలను నడుపుతున్నారు. లఖ్‌నవూ, కాన్పూర్‌, వారణాసిలోని ఆయన ఆస్తులపై 2018లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించి, కొంత డబ్బు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… శక్తి భార్గవ మూడు భవనాలను కొనుగోలు చేసి, తన బ్యాంకు ఖాతా నుంచి రూ.11.5 కోట్లు చెల్లించారు. ఆ భవనాలను తనతో పాటు తన భార్య, పిల్లలు, బంధువుల పేర్ల మీద కొనుగోలు చేశారు. అయితే, వీటిని కొనుగోలు చేయడానికి ఆయనకు డబ్బు ఎలా వచ్చిందన్న విషయంపై ఆదాయపన్ను శాఖ అధికారులకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. మరోవైపు, ఈ భవనాల విషయంలో తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నట్లు తెలిసింది. ఆ మూడు భవనాల విషయంలో భార్గవ మోసపూరితంగా వ్యవహరించినట్లు ఆయన తల్లిదండ్రులు ఇటీవల ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ భవనాలను కొనుగోలు చేయకముందు అవి ఆయన తల్లిదండ్రుల పేరిటే ఉన్నట్లు తెలుస్తోంది. జీవీఎల్‌ నరసింహారావుపై ఆయన చెప్పు విసిరిన నేపథ్యంలో.. భార్గవ మాజీ లాయరు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ విషయాన్ని తెలిపారు. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన అన్నారు. ఆయన ప్రవర్తన కారణంగా తాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన తరఫున లాయరుగా పనిచేయకూడదని నిర్ణయించుకుని వచ్చేశానని తెలిపారు. భార్గవ తన సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీపై పదేపదే విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.