ఈ వినాయకచవితి.. సన్నీలియోనీకి స్పెషల్‌

బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ ఈ వినాయకచవితి పండగను మరింత ప్రత్యేకంగా జరుపుకొన్నారు. భర్త డేనియల్‌ వెబర్‌తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ముంబయిలో ఇంటిని కొనుగోలు చేసిన ఆమె భర్తతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

‘నాకు నియమాలు, నిబంధనలు తెలియవు. ఈ రోజు ఏం చేయాలో, చేయకూడదో కూడా తెలియదు. కానీ, వెబర్‌, నేనూ ముంబయిలోని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా ఈ పండగను మరింత ప్రత్యేకంగా జరుపుకొంటున్నాం. ప్రతి ఒక్కరికీ వినాయకచవితి శుభకాంక్షలు. దేవుడు మీకు సకల శుభాలు కలుగజేయుగాక’ అని భర్తతో కలిసి ఇంట్లోకి ప్రవేశిస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

సన్నీ 36వ పుట్టినరోజు సందర్భంగా అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే బెవర్లీ హిల్స్‌కు సమీపంలో దీన్ని కొనుగోలు చేశారు. మొత్తం అయిదు బెడ్‌ రూమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌, హోమ్‌ థియేటర్‌, గార్డెన్‌, అవుట్‌ డోర్‌ డైనింగ్‌ ఏరియా ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆ బంగ్లాలో ఉన్నాయి. ప్రస్తుతం సన్నీలియోని బయోపిక్‌ ‘కరన్‌జీత్‌కౌర్‌’ పేరుతో వెబ్‌ సిరీస్‌గా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు, ఓ చారిత్రక చిత్రంలోనూ సన్నీ నటిస్తున్నారు.