Homeతెలుగు Newsవచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10వేలు‌: కేసీఆర్‌

వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10వేలు‌: కేసీఆర్‌

ఎన్నో కష్టాలు భరించి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వస్తే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది భయపెట్టారని.. వాటినన్నింటినీ పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలో నంబర్‌వన్‌గా ముందుకెళ్తోందన్నారు. సిద్దిపేటలో జరిగిన టీఆర్‌ఎస్‌ ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కె.కేశవరావు, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

6 19

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రజల స్పందన చూస్తుంటే సిద్దిపేట నుంచి హరీశ్‌రావు, దుబ్బాక నుంచి రామలింగారెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది. సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీశ్‌రావు ఎంతో అభివృద్ధి చేశారు. జిల్లాకు మెడికల్‌ కళాశాల తీసుకొచ్చారు. రెండేళ్లలో సిద్దిపేటకు రైలు వస్తుంది. దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు 70శాతం మంది ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతులు ఎన్ని బాధలు పడ్డారో అందరికీ తెలిసిందే. వారి అప్పుల బాధ తీరిపోయి మంచిగా ఉండాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రెండు విడతలుగా రూ.8వేలు ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి దాన్ని రూ.10వేలు చేస్తాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ అందిస్తాం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించే కార్యాచరణ రూపొందిస్తున్నాం. తెలంగాణను పంటల కాలనీలుగా విభజిస్తాం. రైతులు పండించిన పంటలను మహిళా సంఘాలే కొనేలా చేస్తాం. పంటలను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేసే బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగిస్తాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తోంది. మా ప్రభుత్వం హయాంలో దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు, భూకబ్జాలు ఏమీ లేవు’ కేసీఆర్‌ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu