మలయాళ నటుడు టోవినో థామస్ ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ‘నడిగర్ తిలకం’ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. టోవినో తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. టోవినో నటిస్తున్న చిత్రం తమిళనాడులోని పెరంబదూరు సమీపంలో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు టోవినో థామస్ రెండు కాళ్లకు గాయాలైనట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఓ వారం వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో సినిమా షూటింగ్ వారంపాటు వాయిదా వేశారు.
రెండేళ్ల క్రితం వచ్చిన మిన్నల్ మురళీ సినిమాతో టోవినో థామస్‌కు తెలుగులోనూ మంచి పాపులారిటీ వచ్చింది. అప్పటి నుంచి ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల విడుదలైన 2018 సినిమా కూడా తెలుగులో మంచి కలెక్షన్లు సాధించింది.
ప్రస్తుతం టొవినో నటించిన ఏఆర్‌ఎమ్ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులోనూ ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
లాల్ జూనియర్ తెరకెక్కిస్తున్న ‘నడిగర్ తిలకం’ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ వంటి బంపర్ హిట్ తర్వాత లాల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే జనవరి నాటికి షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.