బీజేపీతో పొత్తువల్లే 2014లో టీడీపీ గెలిచింది

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌.. మోడీని ప్రధాని బాధ్యతల నుంచి సెలవు తీసుకునేట్లు చేస్తామన్న నేతలంతా.. సెలవులపై విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జావడేకర్‌ మాట్లాడుతూ మోడీని ఓడించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామన్న నేతలను, పార్టీలను ప్రజలు ఓడించి గుణపాఠం చెప్పారంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తువల్లే 2014లో టీడీపీ గెలిచిందని.. మోడీని దూషించడంతోనే తాజా ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తిరస్కరించారన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల డొల్లతనం బయటపడిందని.. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలు సైతం ఆ గందరగోళంలో భాగమేనంటూ జావడేకర్‌ అన్నారు.