నటితో బోనీ కపూర్‌ అసభ్య ప్రవర్తన అంటూ ప్రచారం.. మండిపడ్డ నటి

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌.. సినీ నటి ఊర్వశి రౌతెలాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసింది. నిర్మాత జయంతిలాల్‌ గదా కుమారుడి వివాహం ఇటీవల ముంబయిలో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ సమయంలో బోనీ, ఊర్వశి ఒకేసారి వేడుకకు రావడంతో ఇద్దరూ కలిసే ఫొటోలకు పోజులిచ్చారు. ఆ సమయంలో బోనీ.. ఊర్వశిని.. ‘ఇలా వచ్చి నిలబడండి’ అంటూ ఆమెను పక్కకు వెళ్లమన్నారు. అక్కడి మీడియా వర్గాలు బోనీ.. ఊర్వశితో మాట్లాడుతున్న దృశ్యాన్ని వీడియో తీశాయి. ‘ఊర్వశిని బోనీ పట్టుకోబోయారు. అప్పుడు ఆమె ‘డోన్ట్‌ టచ్‌’ అని వార్నింగ్‌ ఇచ్చారు’ అని ఓ పత్రిక ప్రచురించింది. ఈ విషయం కాస్తా ఊర్వశి దృష్టికి రావడంతో ట్విటర్‌ వేదికగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశంలోనే పేరున్న వార్తాపత్రిక.. ఇలాంటి చెత్త వార్తను ప్రచురించింది. మహిళలను గౌరవించడం రాకపోతే మహిళాసాధికారత గురించి, వారి శక్తి సామర్థ్యాల గురించి మీరు మాట్లాడకండి’ అని పేర్కొన్నారు.