భారత్‌పై దాడులు చేస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరిక..!


ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలంటూ అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్‌ను హెచ్చరించింది. పాక్‌ భూభాగంలోకి భారత విమానాలు చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిన మరుసటి రోజే అమెరికా ఈ తరహాలో స్పందించడం గమనార్హం. సరిహద్దు వెంట నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. తొందరపాటు చర్యలకు పాల్పడొద్దంటూ యూఎస్‌ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడానన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించానన్నారు. ఇక ముందర ఎలాంటి సైనిక చర్యకు పాల్పడొద్దని కోరినట్లు తెలిపారు.

పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీతో మాట్లాడిన పాంపియో ఉద్రిక్త పరిస్థితులకు ఎలాంటి అవకాశమివ్వొద్దని కోరినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయనకు వివరించినట్లు సమాచారం. గతవారం అజిత్‌ దోవల్‌తో మాట్లాడిన అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్.. ఆత్మ రక్షణ చర్యల్లో భాగంగా భారత్‌ తీసుకోబోయే ఎటువంటి చర్యలకైనా అమెరికా మద్దతిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరవాత ప్రతీకారంతో రగిలిపోయిన భారత్‌ మంగళవారం తెల్లవారుజామున జైషే ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. మరిన్ని దాడులకు పాల్పడబోతుందన్న సమాచారం ఉండడంతోనే ముందస్తుగా దాడులు చేయాల్సి వచ్చిందని భారత్‌ ప్రకటించింది.