మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలె ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ విడుదల తేదీని వాయిదా వేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 13న నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ విడుదల కాబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘వాల్మీకీ’ చిత్ర బృందం సినిమాని వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం పలు మార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.
‘వాల్మీకీ’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.14 రీల్స్ ప్లస్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ కు తెలుగు రీమేక్ ఇది. ‘ఎఫ్ 2’ హిట్ తర్వాత వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ఇది. ఆయన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు ఇటీవల విడుదలైన టీజర్‌ను బట్టి తెలిసింది. హరీశ్ శంకర్ మెగా ఫ్యామిలీకి ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ చిత్రాలను అందించారు. దీంతో ‘వాల్మీకి’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













